
లక్సెట్టిపేట వెలుగు: లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ముల్కల్లగూడ ప్రైమరీ స్కూల్ లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్కూల్ లో మొత్తం102 మంది విద్యార్థులు ఉన్నారు. ఐదు తరగతులకు గాను బోధిస్తున్నారు. కేవలం రెండు గదులు మాత్రమే ఉన్నాయి. కిచెన్ షెడ్‌లో స్టూడెంట్లకు పాఠాలు చెబుతున్నారు. టాయిలెట్స్ కోసం నిర్మించిన సెప్టిక్ ట్యాంక్ నిండిపోవడంతో వాటర్ పోవడం లేదు.
విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఇద్దరు రెగ్యులర్, మరో ఇద్దరు డిప్యూటేషన్ పైన వచ్చిన ఉపాధ్యాయులు ఉన్నారు. ఏడాది కాలంగా సెప్టిక్ ట్యాంక్ నిండిపోయి ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.